సెక్రటేరియెట్​లో ఊడిపడ్డ పెచ్చులు..సీఎం చాంబర్ ఉండే అంతస్తు నుంచి కూలిన వైనం

సెక్రటేరియెట్​లో ఊడిపడ్డ పెచ్చులు..సీఎం చాంబర్ ఉండే అంతస్తు నుంచి కూలిన వైనం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సెక్రటేరియెట్ బిల్డింగ్ ప్రారంభించిన ఏడాదిన్నరలోనే నిర్మాణ లోపాలు బయటపడుతున్నాయి. దాదాపు రూ.1200 కోట్లతో నిర్మించిన సచివాలయ బిల్డింగ్ నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి. బుధవారం ఆరో ఫ్లోర్​ (సీఎం చాంబర్​ఉండే అంతస్తు ) పైనుంచి పీఓపీ పెచ్చులు కూలి రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ వెహికల్ పై పడ్డాయి. దాంతో వాహనం పైభాగం దెబ్బతింది. అక్కడ ఎవరూ లేకపోవడడంతో ప్రమాదం తప్పింది.

పీఓపీ పెచ్చులు ఊడి పడటంతో అధికారులు, సెక్యూరిటీ అలర్ట్ అయ్యారు. అక్కడి నుంచి అందరినీ దూరం పంపించారు. పట్టీ మొత్తం కూలే అవకాశం ఉండడంతో వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. నిర్మాణ వ్యయంపైనా ప్రభుత్వం ఇప్పటికే విజిలెన్స్​ ఎంక్వైరీ చేయిస్తున్నట్లు తెలిసింది. సచివాలయంలో అక్కడక్కడ వాటర్ లీకేజీ అవుతుండడంతో గోడలు పెచ్చులూడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్నిచోట్ల మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

ఊడి పడింది జీఆర్‌‌సీ ఫ్రేం మాత్రమే: పల్లోంజీ గ్రూప్

సచివాలయంలో పెచ్చులు ఊడిన ఘటనపై షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ స్పందించింది. రెగ్యులర్ డిపార్ట్‌‌మెంట్ వర్క్‌‌లో భాగంగా కేబుల్, లైటింగ్ కోసం పనులు చేస్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగిందని తెలిపింది. నిర్మా ణంలో ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేసింది. ఊడి పడింది జీఆర్‌‌సీ ఫ్రేం మాత్రమేనని  సంస్థ వెల్లడించింది.

ఇటీవల లైటింగ్ కోసం, కొత్త కేబుల్స్ కోసం జీఆర్‌‌సీ డ్రిల్ చేస్తున్నామని, డ్రిల్ చేస్తే జీఆర్‌‌సీ డ్యామేజ్ అవుతుందని చెప్పింది.  స్ట్రక్చర్ నిర్మాణం పూర్తయి రెండేళ్లు అవుతుందని, ఎలాంటి నాణ్యత లోపం లేదని, తాము ఈ ఘటనపై సమీక్ష చేస్తున్నామని సంస్థ పేర్కొంది.